Diabetes | న్యూఢిల్లీ, జూలై 27: సుఖవంతమైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనకు తెలుసు. కానీ మనలో చాలామందికి అతిగా నిద్రపోవడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని తెలియదు. హెచ్చు తగ్గుల నిద్రకు మన ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. నిద్ర వ్యవధిని తరచూ మార్చుకునే వారికి డయాబెటిస్ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ పరిశోధన ప్రకారం ప్రజలు తమ నిద్ర వ్యవధిని 31 నుంచి 45 నిముషాల పాటు మార్చుకోవడం (నిద్ర వ్యవధి ఎక్కువ/తక్కువ చేయడం) వల్ల 15 శాతం డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది.
ఇదే వ్యవధి గంటకు మించి ఉంటే ఆ ప్రమాదం 59 శాతం పెరుగుతుంది. యూకే బయో బ్యాంక్ ద్వారా పరిశోధకులు యాక్సిలో మీటర్లు ద్వారా 84 వేల మంది నిద్ర నమూనాలను వరుసగా ఏడు రాత్రుళ్లు పరిశీలించారు. అతి నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. నిద్రలేమి కారణంగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావడమే కాక, తీవ్ర రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, హృద్రోగ సంబంధ వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని వెల్లడించిన గత పరిశోధనలను వీరు సమర్థిస్తూ అతి నిద్ర కారణంగా కూడా డయాబెటిస్ సోకే అవకాశాలు 34 శాతం అధికంగా ఉంటాయని తెలిపారు.
చక్కటి ఆరోగ్యం కోసం తగిన సమయంలో, తగినంత నిద్రపోవాలని వారు తమ పరిశోధనలో తెలిపారు. నిద్రకు ముందు టీవీ, మొబైల్ చూడటం మానాలని వారు సూచిస్తున్నారు.