చండీగఢ్, సెప్టెంబర్ 23: పంజాబ్‌లో లోకో పైలట్ అప్రమత్తతతో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం ఢిల్లీ-భటిండా మార్గంలో భంగి నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప కడ్డీలను పెట్టారు. అయితే, ఓ గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పింది.
పట్టాలపై ఇనుప రాడ్లు ఉన్నట్టు గుర్తించిన అతను సకాలంలో బ్రేకులు వేయటంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై వివిధ రకాల వస్తువులు కనిపిస్తుండటం అటు రైల్వే శాఖ, ఇటు ప్రయాణికుల్లో కాస్త ఆందోళన కలిగిస్తున్నది.