న్యూఢిల్లీ, మే 7: భవిష్యత్తులో ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకునే లక్ష్యంతోనే పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను భారత రక్షణ దళాలు కూల్చివేశాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బుధవారం తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న కొన్ని గంటలకే విలేకరుల సమావేశంలో కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలసి మాట్లాడిన ఆయన తన భూభాగంపైన ఉన్న ఉగ్రవాద స్థావరాలపై చర్యలు తీసుకునే ఉద్దేశం పాకిస్థాన్‌లో కనిపించని కారణంగానే పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన వారిని శిక్షించాల్సిన అవసరం ఉందని భారత్ నిర్ణయించిందని చెప్పారు. నిఘా వర్గాల నుంచి అత్యంత కచ్చిత సమాచారంతోనే ఉగ్రవాద స్థావరాలపై భారత సేన దాడులు జరిపినట్లు తెలిపారు. కేవలం ఉగ్ర స్థావరాలపైనే దాడి జరిగిందని, పౌరులు, సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. పాక్ సైన్యం మద్దతు గల ఉగ్ర శిబిరాలను సమూలంగా నాశనం చేస్తామని చెప్పారు.
కశ్మీరును దెబ్బతీసేందుకే..
జమ్ము కశ్మీరులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ దాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిందని మిస్రీ తెలిపారు. గత ఏడాది కశ్మీరు లోయను రికార్డు స్థాయిలో 2.30 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారని, పర్యాటకమే ప్రధాన ఆదాయంగా ఉన్న కశ్మీరును ఆర్థికంగా దెబ్బతీసే ఉద్దేశంతో ఈ దాడి జరిగిందని ఆయన అన్నారు.
మహిళా అధికారుల వివరణ
సైన్యానికి చెందిన సిగ్నల్స్ కోర్కు చెందిన కర్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ పైలట్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్‌లో గురిపెట్టిన ఉగ్ర స్థావరాల పేర్లు, వివరాలను విలేకరులకు వివరించారు. సోఫియా ఖురేషి హిందీలో మాట్లాడగా వ్యోమికా సింగ్ ఇంగ్లిష్‌లో వివరాలు వెల్లడించారు. మే 6-7 తేదీ మధ్య రాత్రి ఒంటి గంట నుంచి 1.30 గంటల వరకు భారతీయ సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ నిర్వహించినట్లు కర్నల్ ఖురేషి తెలిపారు. ఏప్రిల్ 22న అమానుష పహల్గాం ఉగ్ర దాడి మృతులకు, వారి కుటుంబాలకు న్యాయం చేసేందుకు ఈ ఆపరేషన్ చేట్టినట్లు ఆమె వెల్లడించారు. స్క్రీన్‌పై కొన్ని దృశ్యాలు కనిపిస్తుండగా దాడి చేసిన ఉగ్రస్థావరాల వివరాలను ఆమె వివరించారు.
ఈ ఆపరేషన్‌లో 9 ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లు ఖురేషి తెలిపారు. గడచిన మూడు దశాబ్దాలలో పాకిస్థాన్‌లో నియామకం, శిక్షణ, లాంచ్ ప్యాడ్లతోసహా ఉగ్రవాదులకు సంబంధించిన మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగిందని ఆమె చెప్పారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ కచ్చితత్వంతో కూడిన సామర్ధ్యాలతో ఉగ్ర శిబిరాలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపిక చేసిన మందుగుండుతో అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను ఉగ్ర శిబిరాలపై ప్రయోగించడం జరిగిందని ఆమె వివరించారు. ప్రతి టార్గెట్ లక్ష్యం ఒక నిర్దిష్టమైన భవనాన్ని లేదా భవనాల సముదాయాన్ని ధ్వంసం చేయడమని ఆమె తెలిపారు. అన్ని లక్ష్యాలు విజయవంతంగా పూర్తయ్యాయని, భారతీయ సాయుధ దళాల ప్రొఫెషనలిజం ఆపరేషన్ సిందూర్ ప్రణాళిక, దాని అమలులో మరోసారి నిరూపితమైందని ఆమె చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో సైనిక స్థావరాలపై గురిపెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. భారత్ తన జవాబు ఇవ్వడంలో చాలా సంయమనం పాటించిందని, అయితే ఉద్రిక్తతలు మరింత పెరిగితే పాకిస్థానీ దుస్సాహసాలను తిప్పికొట్టేందుకు భారత సాయుధ దళాలు పూర్తి సంసిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు.
మరిన్ని దాడులపై నిఘా సమాచారం
భారత్‌పై మరిన్ని దాడులు జరగవచ్చని పాకిస్థాన్‌లోని ఉగ్రవాద గ్రూపుల కదలికలపై కన్నేసిన తమ నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని మిస్రీ తెలిపారు. పాకిస్థాన్‌లోని, పాక్ ఆక్రమిత కశ్మీరులోని 9 ఉగ్ర స్థావరాలపై భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరిట క్షిపణి దాడులు జరిపిన నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి విలేకరులతో మాట్లాడారు. ఉగ్రవాదులను నిరోధించి, నివారించే విషయమై తమపై ఒత్తిడి ఉందని ఆయన చెప్పారు. భారత్‌లోకి చొరబడేందుకు అవకాశం ఉన్న ఉగ్రవాదుల మౌలిక సౌకర్యాలను ధ్వంసం చేయడంపైనే భారత బలగాలు దృష్టి సారించాయని మిస్రీ తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి జరిగి రెండు వారాలు గడిచినా తన భూభాగంపైన, తన అధీనంలోని ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలకు వ్యతిరేకంగా పాకిస్థాన్ వైపు నుంచి ఎటువంటి ప్రతీకాత్మక చర్యలు కనపడలేదని ఆయన చెప్పారు. పహల్గాం దాడిని ప్రస్తావిస్తూ లష్కరే తాయిబాకు చెందిన పాకిస్థానీ, పాకిస్థాన్ శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారతీయ పర్యాటకులపై దాడి చేసి 26 మందిని పొట్టనపెట్టుకున్నారని తెలిపారు. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్ర దాడుల తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఉగ్రదాడిలో పౌరులు మరణించడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. పహల్గాం దాడిని అత్యంత పాశవిక, ఆటవిక చర్యగా ఆయన అభివర్ణించారు. తమ కుటుంబ సభ్యుల ముందే బాధితుల తలపై తుపాకీ పెట్టి కాల్చి చంపారని ఆయన చెప్పారు.