కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీల మధ్య అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు, సంభాషణలను బీజేపీ లీక్ చేయడంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇబ్బంది పడ్డారు. ఎంపీలెవరూ మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించారు. లీకైన వీడియోలపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందిస్తూ.. ఓ దురుసు ప్రవర్తన గల మహిళా ఎంపీ తనను అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ నెల 4న టీఎంసీ ఎంపీల బృందం ఎన్నికల సంఘానికి ఒక విజ్ఞప్తిని అందజేయడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు మరో ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ కళ్యాణ్ బెనర్జీని శాంతింపచేయడానికి ప్రయత్నించారు. కళ్యాణ్ బెనర్జీ ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సభ్యత లేని మహిళా ఎంపీని తాను ఆమోదించనని తెలిపారు. ఆమె పార్లమెంట్లో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కావాలని డిమాండ్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై మరో టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పందిస్తూ కళ్యాణ్ బెనర్జీ తప్పుడు ప్రవర్తన వల్ల ఓ టీఎంసీ మహిళా ఎంపీ ఏడ్చారన్నారు. సౌగతా రాయ్ వ్యాఖ్యలపై కళ్యాణ్ బెనర్జీ స్పందిస్తూ.. అతడికి వ్యక్తిత్వం లేదని.. ఆయన నారదా స్కామ్లో దొరికిపోయారని విమర్శించారు.