India-US | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై (India-US trade deal) ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు మరో 48 గంటల్లో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. వాషింగ్టన్లో జరుగుతున్న ఉన్నతస్థాయి చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో ఇరు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. చర్చలు చివరి దశలో ఉన్నాయని, రానున్న 48 గంటల్లో ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
భారత ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 10 శాతం టారిఫ్ విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై అదనపు సుంకాలను ప్రకటించారు. ఏప్రిల్ 2న మన దేశంపై ట్రంప్ 26 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అదనపు సుంకాలను జులై 9 వరకూ నిలిపివేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం గతంలోనే ప్రకటించింది. అంతలోపు ఆయా దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే, జులై 9 నుంచి అదనపు సుంకాలు వడ్డిస్తారు. అంతలోపే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి. ఈ అదనపు 26 శాతం సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది.
వాణిజ్య ఒప్పందంలో ఇరు దేశాలూ వ్యవసాయం, ఆటోమొబైల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్, లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్‌లపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. దేశంలో అధిక ఉపాధి కల్పించే తమ ఎగుమతులపై సుంకాలను గణనీయంగా తగ్గించాలని భారత్ ప్రతిపాదిస్తోంది. ముఖ్యంగా వస్త్రాలు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులపై అర్థవంతమైన రాయితీల కోసం భారత్ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయం, డెయిరీ రంగాల్లోనూ తమ ఉత్పత్తులకు పూర్తిస్థాయి మార్కెట్ ప్రవేశం కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కానీ, దేశంలోని గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత దృష్ట్యా ఈ రెండు కీలక రంగాలను ఒప్పందం పరిధి నుంచి దూరంగా ఉంచాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read..
social media accounts | పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను మరోసారి బ్లాక్ చేసిన భారత్
రష్యాతో వ్యాపారం చేస్తే భారత్‌పై 500% సుంకం!: అమెరికా