Mysterious Deaths | కశ్మీర్ కొండల్లో జరుగుతున్న మిస్టరీ మరణాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. దీనిపై దర్యాప్తు చేసి కారణాలు తెలుసుకునేందుకు తక్షణం కేంద్ర బృందం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ బృందానికి కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి సారధ్యం వహిస్తారు. ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, వ్యవసాయం ఎరువులు-రసాయనాలు, జల వనరుల మంత్రిత్వశాఖల నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఫుడ్ సేఫ్టీ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ తదితర విభాగాల అధికారులు ఈ బృందానికి సహకరిస్తారు.
జమ్ముకశ్మీర్ అధికారులతో కలిసి ఈ బృందం ఆదివారం దర్యాప్తు ప్రారంభిస్తుంది. బాధితులకు తక్షణ సాయంతోపాటు భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరక్కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ ప్రాంతంలో గత 45 రోజుల్లో 16 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు. జ్వరం, వంటి నొప్పులు, వికారం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో కశ్మీర్ వాసులు దవాఖానల్లో చేరిన కొన్ని రోజుల్లోనే మృత్యువాత పడుతున్నారు.
బాధితుల రక్త నమూనాలు సేకరించి దేశంలోని అత్యున్నత ల్యాబ్‌లకు పంపింది కేంద్ర వైద్యారోగ్యశాఖ. పుణెలోని ఎన్ఐవీ, ఢిల్లీలోని ఎన్సీడీసీ, లక్నోలోని ఎన్ఐటీఆర్, గ్వాలియర్‌లోని డీఆర్డీవో, చండీగఢ్, జమ్ముల్లోని పరిశోధక ల్యాబ్‌ల్లో పరీక్షించినా వైరస్ లేదా బ్యాక్టీరియా కారకాలు లేవని తేలింది. ఐఐటీఆర్ (టాక్సికాలజీ రీసెర్చ్) పరీక్షల్లో మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేలింది. దీంతో కేంద్రం అప్రమత్తమై.. ఈ అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది.