న్యూఢిల్లీ: అతివేగంగా లేక నిర్లక్ష్యంగా వాహనాన్ని(Reckless Driving) నడిపి ప్రాణాలు కోల్పోతే, ఆ బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ వర్తించదు అని సుప్రీంకోర్టు(Supreme Court) తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ ఫ్యామిలీకి నష్టపరిహారాన్ని ఇవ్వలేవని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పీఎస్ నరసింహ, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఓ కేసులో ఈ తీర్పును వెలువరించింది. కారు ప్రమాదంలో మరణించిన తన భర్తకు నష్టపరిహారంగా 80 లక్షలు ఇవ్వాలని భార్య పెట్టుకున్న దరఖాస్తును సుప్రీం విచారించింది. అయితే కారును అతి వేగంగా డ్రైవ్ చేస్తూ అతను యాక్సిడెంట్‌కు గురై చనిపోయాడు. 2024, నవంబర్ 23వ తేదీన ఇదే కేసులో కర్నాటక హైకోర్టు తీర్పును ఇచ్చింది. భార్య, కుమారుడు, బాధితుడు పేరెంట్స్ పెట్టుకున్న నష్టపరిహార అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలమేని, అందుకే స్పెషల్ లీవ్ పిటీషన్‌ను డిస్మస్ చేస్తున్నామని సుప్రీం బెంచ్ తెలిపింది.
2014, జూన్ 18వ తేదీన బాధిత వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. మల్లసంద్ర గ్రామం నుంచి అరిసకేరి పట్టణానికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బాధిత వ్యక్తి ఎన్ఎస్ రవిశ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో అతని తండ్రి, సోదరుడు, పిల్లలు ఉన్నారు. చాలా నిర్లక్ష్యంగా బాధితుడు తన కారును డ్రైవ్ చేసినట్లు కోర్టు తెలిపింది. ట్రాఫిక్స్ రూల్స్ పాటించలేదని, దాని వల్లే వాహనం కంట్రోల్ తప్పిందని కోర్టు చెప్పింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రవిశ ఆ తర్వాత ప్రాణాలు విడిచాడు.
బాధిత వ్యక్తి ర్యాష్‌గా, నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని హైకోర్టు తన తీర్పులో చెప్పింది. ఈ కేసులో వారసులెవరైనా చట్టపరమైన పరిహారాన్ని కోరలేరని పేర్కొన్నది. నిబంధనలను అతిక్రమించి తప్పు చేసిన వ్యక్తికి పరిహారాన్ని ఇవ్వడం కరెక్టు కాదు అని కోర్టు వెల్లడించింది.