న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా క్లెయిముల పోర్టల్ నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్సేంజ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. బీమా కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ సేవలను అందజేసే సంస్థలు, రోగులకు ఓ వేదికగా ఈ ఎక్సేంజ్ ఉపయోగపడుతున్నది. దీనిని కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తే, వైద్య చికిత్స ధరలను నిర్ణయించడంపై బేరమాడే శక్తి బీమా కంపెనీలకు పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రభుత్వం, భారత బీమా నియంత్రణ, అభివృద్ధి వ్యవస్థ (ఐఆర్డీఏఐ) విశ్లేషణలో, దవాఖానలు రోగులకు గల అత్యధిక బీమా కవరేజ్‌కు అనుగుణంగా చికిత్స ధరలను భారీగా పెంచుతున్నట్లు గుర్తించాయి. ఫలితంగా బీమా కంపెనీలు అత్యధిక ఆరోగ్య బీమా ప్రీమియంలను ఛార్జి చేయవలసి వస్తున్నది. పర్యవసానంగా ఆరోగ్య బీమా కవరేజ్ చాలా మందికి అందుబాటులో ఉండటం లేదు. ప్రీమియం అందుబాటు ధరల్లో లేకపోవడంతో పాలసీ రెన్యువల్స్ తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఈ ఎక్సేంజ్‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని నేషనల్ హెల్త్ అథారిటీ పర్యవేక్షిస్తున్నది.