Bangalore | బెంగళూరు : ఎడతెగని ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం సతమతమయ్యే బెంగళూరు మరోసారి హెడ్లైన్లలో నిలిచింది. అయితే ఎప్పటిలా ఇక్కడ ఇన్ని గంటలు.. అక్కడ అన్ని గంటలు ట్రాఫిక్ జామ్ లాంటి రొటీన్ విషయాలతో కాదు. ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్ బెంగళూరు నగర ట్రాఫిక్ జామ్‌పై సామాజిక మాధ్యమంలో సెటైర్ వేశారు. ‘బెంగళూరు టూరిజం శాఖ 4 పగళ్లు, 3 రాత్రుళ్లు ఈ కింది ప్రదేశాలకు ట్రిప్ నిర్వహిస్తున్నది.
అవి ఔటర్ రింగ్ రోడ్డు, సిల్క్ రోడ్ జంక్షన్, మరాఠాహళ్లి, హెచ్ఎస్ఆర్ లే అవుట్లు. ఇవన్నీ తప్పక సందర్శించాల్సిన స్థలాలు. దీనిని చార్ జామ్ యాత్ర అంటారు’ అని పేర్కొన్నారు. ‘బెంగళూరుపై ఒక విచారకరమైన జోక్. మనల్ని, మన బాధలను గురించి పట్టించుకోని ప్రభుత్వం గురించి మనకు హాస్య చతురత ఉంది’ అని పోస్ట్ చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ, ‘ట్రాఫిక్ జామ్‌ల కారణంగా యాత్రను నిర్వహించలేక పోతున్నాం’ అని వ్యాఖ్యానించారు.