ఇండోర్: అతని వయసు ఏడేళ్లు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. భర్తతో గొడవపడి ఆమె కూడా విడిపోయింది. దాంతో బాలుడి తండ్రి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మూడో భార్య.. మొదటి భార్య కొడుకును ఓర్చలేకపోయింది. ఆ బాలుడి విషయంలో నిత్యం గొడవపడింది. చివరికి బాలుడి హత్యకు కారణమై భర్తతోపాటు జైలుకు వెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన శశిపాల్ అనే వ్యక్తి మొదటి భార్య ద్వారా ఒక కొడుకును కన్నాడు. అతనికి ప్రతీక్ అని పేరు పెట్టుకున్నారు. అయితే, కొద్ది రోజులకే ప్రతీక్ తల్లి మరణించడంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె అతడిని వదిలేసి వెళ్లింది. దాంతో పాయల్ అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే పాయల్ ప్రతీక్‌ను సరిగా చూసుకునేది కాదు.
నిత్యం అతడిని కొడుతూ, తిడుతూ టార్చర్ చేసేది. ఈ విషయమై భర్తభార్యలకు ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే పాయల్ డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది. రెండు నెలల క్రితం ఓ బాలుడికి జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో శశిపాల్ భార్యను తీసుకొచ్చుకునేందుకు వెళ్లగా పాయల్ నిరాకరించింది. ప్రతీక్‌ను ఇంటికి దూరంగా పంపిస్తే, లేదంటే చంపేస్తేనే తాను వస్తానని లేదంటే పుట్టింట్లోనే ఉంటానని తెగేసి చెప్పింది.
దాంతో తిరిగి తన ఇంటికి వచ్చిన శశిపాల్ కొడుకు ప్రతీక్‌ను పిలిచి రాత్రికి తన ఏసీ గదిలోనే పడుకోమని చెప్పాడు. వాస్తవానికి తన తల్లి చనిపోయినప్పటి నుంచి ప్రతీక్ తాత, నానమ్మలతో కలిసి పడుకునేవాడు. కానీ, ఎప్పుడూ దగ్గరికి తీయని తండ్రి ప్రేమగా పిలిచి మరీ ఏసీ గదిలో పడుకోమని చెప్పడంతో మురిసిపోయాడు. అదే విషయం తాతా, నానమ్మలతో సంతోషంగా చెప్పి తండ్రి గదిలోకి వెళ్లాడు. ప్రతీక్‌ను వాళ్లు ప్రాణాలతో చూడటం అదే ఆఖరిసారి అయ్యింది.
కన్నతండ్రిని నమ్మి అతడి పక్కనే హాయిగా నిద్రపోయిన ప్రతీక్‌కు అదే ఆఖరి రాత్రిగా మారిపోయింది. ప్రతీక్ నిద్రపోగానే టీవీ సౌండ్ పెంచిన శశిపాల్ అతడి గొంతునులిమి దారుణంగా హత్యచేశాడు. హత్యకు ముందు భార్యకు వీడియోకాల్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. దాంతో హత్య అనంతరం వీడియో తీసి భార్య పాయల్‌కు వాట్సాప్ చేశాడు. అయితే, అప్పటికే ఆమె శశిపాల్ నంబర్‌ను బ్లాక్ చేసి ఉండటంతో ఆ వీడియో ఆమెకు చేరలేదు.
ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. తెల్లవారుజామున మనవడిని విగతజీవిగా చూసిన తాత, నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఘటనపై కేసు నమోదు చేసి శశిపాల్‌ను, అతడి మూడో భార్య పాయల్‌ను అరెస్ట్ చేశారు. శశిపాల్ మీడియాతో మాట్లాడుతూ.. నా భార్యకు నా కొడుకుతో ఎప్పుడూ సమస్యే ఉండేదని, ఇప్పుడు అతడిని చంపేశానని, ఇక అతడితో ఆమెకు ఎలాంటి సమస్యలు ఉండని వ్యాఖ్యానించాడు. కాగా, ప్రతీక్‌ను చంపమని తాను ఎన్నడూ చెప్పలేదని, తన భర్త అబద్ధం చెబుతున్నాడని పాయల్ తెలిపింది.