న్యూఢిల్లీ, నవంబర్ 11: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆంగ్లంలో, దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో అభినందనలు తెలిపారు. సీజేఐ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జస్టిస్ డీవై చంద్రచూడ్ పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా మొదటిసారి కోర్టు నిర్వహించారు. తనకు అభినందనలు తెలిపిన న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే.
న్యాయవాదిగా ప్రస్థానం మొదలు..
ఢిల్లీకి చెందిన జస్టిస్ సంజీవ్ ఖన్నా(64) వచ్చే ఏడాది మే 13 వరకు సీజేఐగా కొనసాగనున్నారు. ఆయన ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా కుమారుడు. 1960 మే 14న జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్లో న్యాయవాద విద్యను పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. మొదట తీస్‌హజారీ జిల్లా కోర్టులో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేశారు. 2019 జనవరిలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు కేంద్రప్రభుత్వం ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియమించింది. అయితే, సీనియారిటీని పాటించకుండా ఆయన నియామకం జరిగిందని పలువురు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యతిరేకించడం అప్పట్లో వివాదంగా మారింది. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా పలు కీలక తీర్పులు ఇచ్చారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని ఆయన సమర్థిస్తూ తీర్పునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒకరు. ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేశారు.
పెద్దనాన్న కోల్పోయిన అవకాశం
జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా పెద్దనాన్న అవుతారు. నిజానికి 48 ఏండ్ల క్రితం జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా సీజేఐ కావాల్సి ఉంది. అయితే, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా ఇచ్చిన తీర్పు ఫలితంగా ఆయన ఈ అవకాశాన్ని కోల్పోయారు. ఎమర్జెన్సీ సమయంలో పెద్ద ఎత్తున విపక్ష నేతల అరెస్టులు జరిగాయి. వీరు అరెస్టులపై కోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుందని పలు రాష్ర్టాల హైకోర్టులు తీర్పులు చెప్పాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివ్కాంత్ శుక్లా కేసుగా పిలిచే ఈ కేసును విచారించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు పౌరులకు లేదని 4:1 మెజార్టీతో తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఒక్కరే ఈ తీర్పును వ్యతిరేకించారు. దీంతో సీనియారిటీ ప్రకారం 1977లో 15వ సీజేఐగా జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా నియామకం కావాల్సి ఉన్నప్పటికీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ వ్యతిరేకించడంతో జూనియర్ అయిన జస్టిస్ మిర్జా హమీదుల్లా బేగ్‌కు అవకాశం దక్కింది.