ప్రయాణికుల విమానాల కోసం 2024 జనవరిలో డీజీసీఏ భారీ స్థాయిలో మార్పులను తీసుకువచ్చింది. ప్రయాణికుల భద్రతను పెంచే ఉద్దేశంతో పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతిపై దృష్టి పెడుతూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(ఎఫ్డీటీఎల్) పేరిట ఉన్న ఈ కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లు వారానికి గతంలోలాగా 36 గంటలు కాకుండా 48 గంటలపాటు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. దీనికి అదనంగా వారికి ఒక సెలవు కేటాయిస్తారు. అంటే మొత్తంగా వారంలో 3 రోజులు సెలవులు లభిస్తాయన్న మాట. అలాగే, వారానికి ఇదివరకు ఉన్నట్టు ఆరు నైట్-టైమ్ ల్యాండింగ్స్ (నైట్ డ్యూటీ) కాకుండా దానికి బదులుగా రెండు నైట్-టైమ్ ల్యాండింగ్స్కు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ రూల్స్‌లోని రెండో దఫా ప్రక్రియ నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, ఈ నిబంధనలకు అనుగుణంగా పైలట్ల డ్యూటీ షెడ్యూల్ ప్లానింగ్ చేయడంలో, ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవడంలో ఇండిగో విఫలమయ్యింది. అంతేకాదు, శీతాకాలం, క్రిస్మస్ నేపథ్యంలో తన విమాన సర్వీసులను 6 శాతం మేర పెంచింది. దీంతో పైలట్లు, సిబ్బంది కొరత మరింతగా ఏర్పడింది. ఈ పరిస్థితిని ముందుగా అంచనావేయకపోవడంలో ఇండిగో విఫలం అవ్వడంతో ఈ సంక్షోభం తలెత్తింది. వాటికి తోడు చిన్నపాటి సాంకేతిక సమస్యలు, శీతాకాలంతో ముడిపడిన షెడ్యూల్ మార్పులు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, ఏవియేషన్ వ్యవస్థలో పెరిగిన రద్దీ సమస్యను మరింత జటిలం చేశాయి.
దేశంలోనే ప్రముఖ ఎయిర్‌లైన్ సర్వీసుగా పేరున్న ఇండిగో ప్రతిరోజు దాదాపు 2,300 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిర్వహిస్తుంది. ఎయిర్‌లైన్స్ సమయపాలనకు కొలబద్ధ అయిన ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్(ఓటీపీ)లో ఇండిగోకు మంచి రికార్డు ఉండేది. అయితే, తాజా సమస్య కారణంగా.. ఇండిగో ఓటీపీ రేటు గురువారం 8.5 శాతానికి పడిపోయినట్లు పౌర విమానయాన మంత్రిత్వశాఖ డాటా చెబుతోంది. సోమవారం ఇండిగో ఓటీపీ 50 శాతం ఉండగా.. అది మంగళవారానికి 35 శాతానికి, బుధవారానికి 19.7 శాతానికి పడిపోయింది. ఎయిర్ ఇండియా ఓటీపీ 61 శాతం ఉండగా.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఓటీపీ 58.6 శాతంగా ఉంది. ఆకాశ ఎయిర్ ఓటీపీ 63 శాతంగా ఉంది. స్పైస్‌జెట్ ఓటీపీ 56.4 శాతం ఉండగా.. ప్రభుత్వానికి చెందిన అలయెన్స్ ఎయిర్ ఓటీపీ 56 శాతం ఉంది. ఇండిగో షేర్లు బీఎస్ఈలో శుక్రవారం మధ్యాహ్నానికి 3 శాతం పతనమయ్యాయి.
ఇండిగోతో పోలిస్తే, దేశీయంగా నడిచే మిగతా ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఆ స్థాయిలో విమానాలు లేవు. అలాగే, కొత్త విమానాల డెలివరీ, మరమ్మతులు జరగడానికి ముందే ఆయా సంస్థలు పైలట్లు, ఇతర సిబ్బందిని ముందస్తుగానే నియమించి పెట్టుకొన్నాయి. దీంతో కొత్త రూల్స్ ప్రభావం ఆయా కంపెనీలపై కనిపించడం లేదు.
