బెంగళూరు: చిన్నారి మెడలోని బంగారు గొలుసును ఇండిగో మహిళా సిబ్బంది చోరీ చేసింది. (IndiGo crew member) మహిళా ప్రయాణికురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 1న ప్రియాంక ముఖర్జీ చిన్న పిల్లలైన ఇద్దరు కుమార్తెలతో కలిసి కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఇండిగో విమానంలో ప్రయాణించింది.
కాగా, విమానం గాలిలో ఉండగా తన ఐదేళ్ల కుమార్తె ఇబ్బందికి గురై ఏడ్చినట్లు ప్రియాంక ముఖర్జీ తెలిపింది. దీంతో ఆ పాపను మహిళా క్యాబిన్ సిబ్బందికి అప్పగించినట్లు చెప్పింది. అయితే బిడ్డను తనకు తిరిగి ఇచ్చినప్పుడు చిన్నారి మెడలోని గోల్డ్ చైన్ మాయం కావడాన్ని గమనించినట్లు ఆమె ఆరోపించింది. తన కుమార్తె మెడలోని చైన్‌ను చోరీ చేసిన ఇండిగో మహిళా సిబ్బంది అదితి అశ్విని శర్మపై కెంపెగౌడ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.