ముంబై: ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానం తోక భాగం రన్‌వేను తాకింది. (IndiGo Aircraft’s Tail Hits Runway) మళ్లీ గాలిలోకి లేచిన ఆ విమానం ఒక రౌండ్ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రతికూల వాతావరణం వల్ల ఈ సంఘటన జరిగినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇండిగోకు చెందిన ఎయిర్‌బస్ ఏ321 విమానం శనివారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం ప్రయత్నించింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు ల్యాండింగ్‌ను విరమించారు. ఆ విమానం తిరిగి గాలిలోకి లేచే సమయంలో తోక భాగం రన్‌వేను తాకింది. ఆ తర్వాత గాలిలో ఒక రౌండ్ తిరిగిన ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
కాగా, ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది. శనివారం ముంబైలో ప్రతికూల వాతావరణం వల్ల ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. అన్ని భద్రతా ప్రోటోకాల్స్‌ను అనుసరిస్తున్నట్లు పేర్కొంది. ఆ విమానం తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే ముందు అవసరమైన తనిఖీలు, మరమ్మతులతోపాటు డీజీసీఏ నుంచి అనుమతి పొందుతామని వెల్లడించింది. ‘మా కస్టమర్లు, సిబ్బంది, విమానాల భద్రత మా ప్రధాన ప్రాధాన్యత. ఈ సంఘటన కారణంగా మా కార్యకలాపాలపై ప్రభావాన్ని తగ్గించేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని ఇండిగో ప్రతినిధి తెలిపారు.
Also Read:
Man Tied To Pole Thrashed | అల్లున్ని స్తంభానికి కట్టేసి కొట్టి.. రాత్రంతా అలాగే ఉంచిన అత్తమామలు