న్యూఢిల్లీ: భూమధ్య రేఖ పసిఫిక్ మహా సముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతు పవనాల సీజన్లో ఈ వాతావరణ దృగ్విషయం మరింత బలపడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఇండియన్ ఓషన్ డైపోల్(ఐఓడీ) తన బులెటిన్‌లో మధ్య, తూర్పు పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలు వేడెక్కడం ఎల్ నినో పరిస్థితులకు అవసరమైన పరిమితిని దాటినట్లు వెల్లడించింది. కాగా మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్కాస్ట్ సిస్టమ్(ఎంఎంసీఎఫ్ఎస్) ద్వారా రూపొందిన అంచనాలు సీజన్ ముందుకు సాగుతున్న కొద్దీ ఎల్‌నినో తీవ్రమయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.
భూమధ్య రేఖ పసిఫిక్‌లోని అధిక భాగంలో సముద్ర ఉపరితలం కింద కూడా బలమైన సానుకూల ఉష్ణోగ్రత క్రమరాహిత్యాలు ఉన్నాయని ఐఎండీ గమనించింది. రాబోయే నెలల్లో వెచ్చని నీరు నిరంతరం పైకి రావడం.. ఈ పరిణామాన్ని మరింత బలోపేతం చేయడానికి సంకేతమని తెలిపింది. అయితే భారత దేశ రుతు పవనాలను ప్రభావితం చేసే ఏకైక అంశం ఎల్ నినో మాత్రమే కాదని ఐఎండీ స్పష్టం చేసింది. హిందూ మహా సముద్రంపై ప్రస్తుతం తటస్థ ఇండియన్ ఓషన్ డైపోల్(ఐఓడీ) పరిస్థితులు ఉన్నాయని ఇవి రుతు పవనాల సీజన్ పొడవునా కొనసాగే అవకాశం ఉన్నదని, తటస్థ ఐఓడీ అనేది ఈ సంవత్సరంలో ఎల్ నినో ప్రభావాలను గణనీయంగా పెంచే లేదా తగ్గించే అవకాశం లేదని తెలిపింది.