సమాజంలో అనేక వర్గాలు వ్యతిరేకిస్తున్నా, ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వాటా విక్రయానికి కేంద్రం శరవేగంగా సిద్ధమవుతున్న తీరును చూసి విశ్లేషకులు విస్తుపోతున్నారు. ఎల్ఐసీ…ఎయిర్ ఇండియాలా నష్టాల్లో ఉన్న కంపెనీ కాదు. ప్రభుత్వ రంగ సంస్థల్లోనే తలమానికంగా ఉంటూ భారీ లాభాల్ని ఆర్జిస్తున్న సంస్థ. అంతేకాదు దేశంలోని సామాన్య ప్రజలకు సామాజిక భద్రత, జీవిత బీమాను అందిస్తూనే, దేశ ఆర్తిక వ్యవస్థకు, అభివృద్ధి ప్రాజెక్టులకూ క్రమం తప్పకుండా పెట్టుబడుల్ని అందిస్తున్న బంగారుబాతు ఈ ఎల్ఐసీ. కేంద్ర ప్రభుత్వపు బడ్జెట్‌కు మూడింట ఒకవంతు నిధులు ఎల్ఐసీ పెట్టుబడుల ద్వారా అందుతున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు వివరిస్తున్నారు.
రూ.5 కోట్ల పెట్టుబడి…రూ.36 లక్షల కోట్ల ఆస్తులు
కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఎల్ఐసీ ఆస్తులు ప్రస్తుతం రూ. 36 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత 64 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వానికి రూ. 29 వేల కోట్ల డివిడెండు చెల్లించింది. ప్రభుత్వ సెక్యూరిటీలు, మౌలిక ప్రాజెక్టుల్లో రూ.38 లక్షల కోట్లు పెట్టుబడి చేసింది. 2019-20లో కేంద్ర ప్రభుత్వపు బాండ్లలో రూ.1,78,717 కోట్లు పెట్టుబడి చేసి, పరోక్షంగా రుణం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాల రుణాల్లో ఎల్ఐసీవి ఆ ఏడాది రూ. 1,28,484 కోట్లు ఉన్నాయి. అదే ఏడాది సామాజిక రంగంలో రూ. 52,298 కోట్లు పెట్టుబడి చేసింది. అంతేకాకుండా దేశంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో భారీ వాటాలు ఎల్ఐసీ వద్ద ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో తదితర ఐటీ దిగ్గజాల షేర్లలో సైతం ఎల్ఐసీకి గణనీయమైన వాటా ఉంది. ఈ సంస్థ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయమే సంవత్సరానికి రూ. 2 లక్షల కోట్లకు పైనే ఉంటున్నదంటే ఇది ఎంత కీలకమైన సంస్థో అంచనా వేయవచ్చు. అంతేకాదు, భారతీయ రైల్వేల తర్వాత అత్యధికంగా భూములు కలిగిన సంస్థ ఇదే. ఎల్ఐసీ బీమా పాలసీల విలువ రూ. 56.86 లక్షల కోట్లు. సంస్థకు 1.15 లక్షలకుపైగా ఉద్యోగులు, 11 లక్షల మేర ఏజెంట్లు ఉన్నారు.
విదేశీ గుప్పిట్లోకి
ఎల్ఐసీ ఇక విదేశీ పెట్టుబడి దారుల గుప్పిట్లోకి మారబోతుందా? ఇటీవలి పరిణామాలు అందుకు మార్గాన్ని క్లియర్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రభుత్వం కొంత వాటాను విక్రయించడం ద్వారా పాలసీదారులను, ప్రజలను భాగస్వాములు చేయడం పైకి చెబుతున్న మాటగా కనిపిస్తున్నది. ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటాను గతంలో ఉన్న 49 శాతం పరిమితిని ఈ ఏడాది మార్చిలో 74 శాతానికి పెంచడం ద్వారా వేసిన మొదటి అడుగు పడింది. ఎల్ఐసీలో ఎంత పెట్టుబడిని అనుమతించాలన్న అంశంపై ఇటీవలే ఓ సమావేశం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం రంగ బ్యాంకుల్లో 20 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. అదే 20 శాతం పరిమితిని ఎల్ఐసీలో కూడా అనుమతించే అంశంపై ఆ సమావేశంలో చర్చించారు. ఈ వాటా ఐపీఓ ద్వారా జారీ చేస్తున్న వాటాకు అదనం. ఐపీఓ ద్వారా ఎఫ్ఐఐల కొనుగోళ్లు చేసుకునే అవకాశమూ ఉంది.
నిర్వహణా వ్యయం తక్కువ
ప్రైవేట్ బీమా కంపెనీలకంటే తక్కువ నిర్వహణా వ్యయంతో ఎల్ఐసీ సమర్థవంతంగా నడుస్తున్నట్లు స్వయంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ప్రకటించింది. ప్రైవేట్ రంగ నిర్వహణ వ్యయం వాటి ప్రీమియం ఆదాయంలో 11.72 శాతం కాగా, ఎల్ఐసీ వ్యయాలు 8.68 శాతమే. అందుకే తక్కువ ప్రీమియంనే ఎల్ఐసీ వసూలు చేస్తుంది. ప్రైవేటీకరణ జరిగితే మరింత లాభాల్ని కోరుకునే షేర్హోల్డర్లు ప్రీమియం భారం పెంపునకు కారణమవుతారని విశ్లేషకులు చెపుతున్నారు.
పాలసీ గ్యారంటీ గల్లంతే
ఎల్ఐసీ చట్టం ప్రకారం ఎల్ఐసీ జారీచేసే పాలసీలకు కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ లభిస్తున్నది.ప్రైవేట్ రంగ బీమా కంపెనీలు..బీమా మార్కెట్లో పోటీపడేందుకు ఎల్ఐసీకి ఈ గ్యారంటీని తొలగించమంటూ చాలా ఏండ్లుగా పోరుపెడుతున్నాయి. సంస్థలో కొంత వాటా ప్రైవేట్ ఇన్వెస్టర్ల చేతికి వెళితే,,తదుపరి రోజుల్లో ఈ గ్యారంటీ ఉండబోదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సంస్థకు ఉన్న ఈ ప్రాధాన్యతల నేపథ్యంలో దీని వాటాను మార్కెట్లో విక్రయించడం ఆర్థిక వ్యవస్థకు, మెజారిటీ ప్రజలకు దీర్ఘకాలంలో తీవ్ర నష్టం కలుగుతుందన్న ఆందోళన విశ్లేషకుల్లో ఉంది. సంస్థ భాగస్వాములైన 40 కోట్ల మంది పాలసీ హోల్డర్ల ప్రమేయం లేకుండానే, పార్లమెంటులో చర్చ అనేది జరక్కుండానే ఎల్ఐసీ వాటాను విక్రయించడానికి కేంద్రం నడుంకట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బోనస్‌కు గండి
ఎల్ఐసీ ప్రస్తుతం వస్తున్న లాభాల్లో 95 శాతం పాలసీదారులకు 5 శాతం ప్రభుత్వానికి ఇస్తుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు 10 శాతం షేర్ హోల్డర్లకు 90 శాతం పాలసీదారులకు ఇస్తున్నాయి. ఎల్ఐసీ ప్రైవేటీకరణతో పాలసీ దారులకు ఇచ్చే బోనస్ మొత్తం కూడా 90 శాతానికే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేట్ సంస్థలు అనుమతించిన తర్వాత ఎల్ఐసీ క్రమంగా కోల్పోతున్న మార్కెట్ వాటా పబ్లిక్ ఇష్యూ తర్వాత మరింత పతనం అయ్యే అవకాశాలున్నాయి.
సామాజిక పథకాలకు తూట్లు
25 కోట్లకుపైగా పేదలున్న మన దేశంలో సామాజిక భద్రతను అందించే సంస్థ వాటాను స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు..పైగా విదేశీ ఇన్వెస్టర్లకు విక్రయిస్తే జరిగేదేమిటో ఎవరికీ తెలియంది కాదు. లాభాపేక్షే ధ్యేయమైన వీరు ఇటువంటి సామాజిక పెట్టుబడుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారనడంలో సందేహం లేదని విశ్లేషకులు వాపోతున్నారు. ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన కింద కేవలం రూ. 330 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల బీమా కవరేజ్‌ని ఎల్ఐసీ అందిస్తున్నది. అలాగే 60 ఏండ్లు దాటిన వృద్ధులకు కేంద్రం ప్రారంభించిన పెన్షన్ పథకాన్ని కూడా ఎల్ఐసీయే నడుపుతున్నది. అలాగే ప్రజలందరి కోసం, ప్రత్యేకించి పేదలు, కార్మికుల కోసం మొదలైన అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌కు ఫండ్ మేనేజర్ ఎల్ఐసీయే.