ముంబై, మార్చి 14 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగ వ్యాపారం కోసం తీసుకున్న రూ.5 లక్షల రుణానికి. ఒక యువ సివిల్ ఇంజినీర్ అసలు, వడ్డీతో సహా మొత్తం రూ.31.50 లక్షలు తిరిగి చెల్లించినప్పటికీ వడ్డీ వ్యాపారులు సంతృప్తి చెందలేదు. ఆ యువకుడిని కిడ్నాప్ చేసి, అతని కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదిరించి, అతని రెండున్నర ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పుండలిక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, లఖన్ రాజు సాబుల్(33), వికీ దేవిదాస్ షిండే (33) అనే ఇద్దరు వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు. వారిని కోర్టు మార్చి 14 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇద్దరు నిందితులు వెంకటేశ్ రాజు ధాగే, ప్రశాంత్ బండు ధాక్నే పరారీలో ఉన్నారు.
ఛత్రపతి శంభాజీ నగర్‌కు చెందిన విశ్వజీత్ తన నిర్మాణ రంగ వ్యాపారం కోసం కారంజ్ ఖేడ్‌లో ఉన్న 2.5 ఎకరాల పొలం తనఖా పెట్టి లఖన్ సాబుల్, వికీ షిండే వద్ద రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పునకు వడ్డీతో కలిపి రూ.16 లక్షలు చెల్లించాడు. అయినా అప్పు తీరకపోవడంతో విశ్వజిత్ అత్త ప్రతిభా దేశ్‌ముఖ్ తన నగలు అమ్మి మరో రూ.15.5 లక్షలు చెల్లించారు. ఇలా మొత్తంగా ఇప్పటివరకు రూ.31.5 లక్షలు వడ్డీ వ్యాపారులకు ఇచ్చారు. అయినప్పటికీ అప్పు తీరలేదని భూమిని స్వాధీనం చేసుకున్న వ్యాపారులు.. ఇంకా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2024 డిసెంబర్ 5న విశ్వజిత్‌ను కిడ్నాప్ చేశారు. అతని వద్ద డబ్బు లేకపోతే, ఆ భూమిని వెంకటేశ్ ధాగేకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. వారు అతన్ని ఎంఐడీసీ చికల్తానా ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి కొట్టారు. తన కుటుంబం, తన ప్రాణాలకు భయపడి, విశ్వజిత్ కారంజ్ ఖేడ్‌లోని తన రెండున్నర ఎకరాల భూమిని వెంకటేశ్ ధాగేకు బదిలీ చేశాడు. వేధింపులతో విసిగిపోయిన దేశ్‌ముఖ్ కుటుంబం చివరకు పుండలిక్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.