భోపాల్: దేశంలోనే అత్యంత పేద వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. ఆ వ్యక్తి సంవత్సర ఆదాయం సున్నా. అధికారులు జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Poorest Man In Madhya Pradesh) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. సత్నా జిల్లా ఉచెహ్రా తహసీల్‌లోని అమ్దారి గ్రామానికి చెందిన సందీప్ కుమార్ నామ్‌దేవ్ ఏమీ సంపాదించడం లేదు. అతడి సంవత్సర ఆదాయం రూ.0గా పేర్కొంటూ ఆదాయ ధృవీకరణ పత్రం జారీ చేశారు. ఏప్రిల్ 7న జారీ చేసిన ఈ సర్టిఫికెట్‌పై ప్రాజెక్ట్ ఆఫీసర్ రవికాంత్ శర్మ సంతకం చేశారు.
Zero Income
కాగా, సున్నా ఆదాయ ధృవీకరణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జూలై 20న అధికారులు హడావిడిగా ఈ సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. సందీప్ వార్షిక ఆదాయం రూ.40,000గా చూపిస్తూ సవరించిన ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ చేశారు.
మరోవైపు సత్నా జిల్లాలోని కోఠి తహసీల్‌లో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నయాగావ్ గ్రామానికి చెందిన రైతు రామ్ స్వరూప్ వార్షిక ఆదాయం రూ.3గా చూపుతూ ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే అతడు నెలకు 25 పైసలు, రోజుకు ఒక పైసా కంటే తక్కువ సంపాదిస్తున్నాడు.
కాగా, ఈ సర్టిఫికెట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని రద్దు చేశారు. రామ్ స్వరూప్ వార్షిక ఆదాయం రూ.30,000గా పేర్కొంటూ కొత్త ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని అధికారులు జారీ చేస్తున్న ఆదాయ ధృవీకరణ పత్రాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతోపాటు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: