Hydrogen Train | న్యూఢిల్లీ, నవంబర్ 13: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన భారతీయ రైల్వే రాబోయే కాలంలో ‘హైడ్రోజన్’తో రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతున్నది. తొలి హైడ్రోజన్ రైలుకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కాబోతున్నది.
ఇందుకు సంబంధించి ట్రయల్ రన్స్ డిసెంబర్లో నిర్వహించనున్నారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. హైడ్రోజన్ రైల్‌కు ప్రతి గంటకు 40 వేల లీటర్ల నీరు అవసరం. నీటి నిల్వ కోసం రైల్లో ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. దేశవ్యాప్తంగా మొత్తం 35 హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను ప్రవేశపెట్టాలన్నది ప్లాన్.
ఇందుకోసం కావాల్సిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ బిగింపు, ఇతర సౌకర్యాల ఏర్పాటుపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఒక్కో రైలుకు సుమారుగా రూ.80 కోట్లు ఖర్చు అవుతున్నదని రైల్వే అధికార ప్రతినిధి దిలీప్ కుమార్ చెప్పారు.