(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలైన సామాన్యులను పెట్రో మంట మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఉక్రెయిన్-రష్యా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇంధన ధరలను మాత్రం తగ్గించడం లేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి.
కానీ కేంద్రం ఎక్సైజ్ సుంకాల పేరిట సవరణలు చేస్తూ ఇంధన ధరలను తగ్గించడం లేదు. దీనికోసం ఎక్సైజ్ డ్యూటీ పేరిట అదనపు సుంకాలను విధిస్తున్నది. గడిచిన పదకొండేండ్లలో కేంద్రం పెట్రోల్‌పై 37.13 శాతం ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, డీజిల్‌పై ఏకంగా 180.89 శాతం పన్ను పెంచింది. వెరసి పొరుగు దేశాలతో పోలిస్తే, ఇండియాలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్నది.