న్యూఢిల్లీ: భారతీయుల రక్తంలో చెడు కొలెస్టరాల్ అధికంగా ఉండటంతో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. దీంతో పాశ్చాత్యులతో పోల్చినపుడు పదేండ్ల ముందుగానే వారు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. భారతీయుల్లో అధిక చెడు కొలెస్టరాల్ ఎందుకు ఉంటుందనే విషయాన్ని జన్యు శాస్త్రం కొంతవరకు వివరిస్తున్నాయని నిపుణులు తెలిపారు. బాడీ మేకప్, కొవ్వులు, చక్కెరలను కణాలు ఉపయోగించుకునే తీరు, వారసత్వ లక్షణాలు భారతీయులకు త్వరగా గుండె జబ్బులు రావడానికి అనుకూలంగా మారుతున్నాయన్నారు.
ఇది కేవలం ఆహారం, జన్యువులకు సంబంధించిన విషయం కాదని పేర్కొన్నారు. జన్యుపరమైన ఈ ధోరణి వల్ల చాలా మంది భారతీయులకు పాశ్చాత్య దేశాల్లోని వారి కన్నా పదేండ్ల ముందుగానే గుండె సమస్యలు వస్తాయని చెప్పారు. చెడు కొలెస్టరాల్ కేవలం జన్యువుల నుంచి మాత్రమే రాదు, జీవన శైలి వల్ల కూడా వస్తుందన్నారు. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం, జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే స్నాక్స్, ఫ్యాటీ మీల్స్ తినడం, రోజూ తగినంత వ్యాయామం చేయకపోవడం, ఒత్తిళ్లు, బరువు పెరగడం వంటివి కూడా ప్రభావం చూపుతాయని తెలిపారు.
వీటివల్ల చెడు కొలెస్టరాల్ (ఎల్డీఎల్) పెరగడం మాత్రమే కాకుండా మంచి కొలెస్టరాల్ (హెచ్డీఎల్) తగ్గుతుంది. ఎల్డీఎల్ పెరిగి, హెచ్డీఎల్ తగ్గితే, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. అందుకే 30 ఏండ్లు పైబడినవారు, తమ వంశంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. చెడు కొలెస్టరాల్ను తగ్గించుకోవాలనుకొనే వారు పండ్లు, కూరగాయలు, పప్పులు, లీన్ ప్రొటీన్స్ తినాలి. రోజూ కనీసం 30 నిమిషాలపాటు నడవాలి. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. ఒత్తిడిని మేనేజ్ చేసుకోవాలి, బరువును నియంత్రించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.