న్యూఢిల్లీ: భారతీయులు యుద్ధం కన్నా నిరుద్యోగ భూతానికి భయపడుతున్నారు. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్‌లో.. పట్టణాల్లో 6.6 శాతం నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 29 ఏళ్ల కన్నా తక్కువ వయసు గలవారిలో 17 శాతం మంది నిరుద్యోగులని వెల్లడిస్తున్నాయి.
ఈ క్రమంలో ఉద్యోగం కోసం వీరు యుద్ధక్షేత్రమైన ఇజ్రాయెల్ వెళ్లేందుకు కూడా వెనకాడటం లేదు. ఇజ్రాయెల్‌కు కార్మికులను పంపేందుకు హర్యానాలోని రోహ్తక్లో ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నియామకాల కార్యక్రమానికి వేల మంది హాజరయ్యారు. వీరిలో తాపీ మేస్త్రిలు, కూలీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు వంటివారు ఉన్నారు. ఇక్కడ ఒక సంవత్సరంలో సంపాదించేదానికి ఐదు రెట్లు ఇజ్రాయెల్‌లో సంపాదించుకోవచ్చునని వీరిలో కొందరు మీడియాకు చెప్పారు.