న్యూఢిల్లీ: భారత్‌లో వంటలు, శుభకార్యాల్లో విరివిగా ఉపయోగించే పసుపులో ‘విషం’ ఉన్నదట. భారత్‌తోపాటు నేపాల్, పాకిస్థాన్‌లో అమ్ముతున్న పసుపులో సీసం (లెడ్) అధిక స్థాయిల్లో ఉన్నట్టు ఓ అధ్యయనం పేర్కొన్నది. భారత ఆహార నాణ్యతా, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్దేశించిన గరిష్ఠ పరిమితి ప్రకారం గ్రాము పసుపులో లెడ్ మోతాదు 10 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ, ఈ అధ్యయనంలో పరిశీలించిన పసుపు శాంపిళ్లలో లెడ్ మోతాదు 1,000 మైక్రోగ్రాముల కంటే అధికంగా ఉన్నట్టు తేలింది.
భారత్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకలోని 23 నగరాల నుంచి సేకరించిన పసుపు శాంపిళ్లను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. పాట్నా, గువాహటి, చెన్నై (భారత్), కాఠ్మాండూ (నేపాల్), కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్ (పాకిస్థాన్) నగరాల నుంచి సేకరించిన నమూనాల్లో 10 మైక్రోగ్రాముల కంటే అధికంగా లెడ్ ఉన్నట్టు తేలింది. ఫ్రీడమ్ ఎంప్లాయబిలిటీ అకాడమీ, ‘ప్యూర్ ఎర్త్’తో కలిసి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ‘సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్’లో ప్రచురితమయ్యాయి.