న్యూఢిల్లీ, జూన్ 24: రైల్వే టికెట్ ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించక పోయినా రైల్వే ఉన్నతాధికారి ఒకరు దీనిని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులపై పెరిగిన చార్జీల భారం జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. నాన్ ఏసీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ చార్జీలు కిలోమీటర్‌కు ఒక పైసా, ఏసీ తరగతి ప్రయాణికులకు 2 పైసలు చొప్పున పెరుగుతాయి. సబర్బన్ రైళ్ల టికెట్ చార్జీలు, నెలవారీ సీజన్ టికెట్ ధరల్లో మార్పు ఉండదు. దీని కారణంగా రోజువారీ రైలు ప్రయాణం చేసే వారిపై భారం పడదు. 500 కి.మీ దూరం వరకు సెకండ్ క్లాస్ సాధారణ తరగతిలో ప్రయాణించే వారికి ఎలాంటి చార్జీల పెంపు ఉండదు. అయితే వీరే 500 కి.మీ దాటి ప్రయాణిస్తే అదనపు కిలోమీటర్‌కు అర పైసా చొప్పున పెరుగుతుంది. అంటే ఉదాహరణకు ఈ తరగతిలో ఎవరైనా 600 కి.మీ దూరం ప్రయాణిస్తే వారిపై అదనంగా 50 పైసలు (100 కి.మీ x 0.005 పైసలు) పెరుగుతుంది.
దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ నడిచే 13 వేల రోజువారీ నాన్ ఏసీ-మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ పెరిగిన చార్జీలు వర్తిస్తాయని, చాలా ఏండ్ల తర్వాత ప్రభుత్వం రైలు చార్జీలు పెంచనుందని, కొత్త చార్జీలు ప్రయాణికుల బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావం చూపదని ఆ సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. కాగా, రైలు టికెట్ల రిజర్వేషన్లో అక్రమాలు చోటుచేసుకోకుండా జూలై 1 నుంచి టికెట్లు బుక్ చేసే ప్రతి ప్రయాణికుడు తప్పక ఆధార్ నమోదు చేసుకోవాలి. అలాగే జూలై 15 నుంచి ప్రయాణికుడి ఆధార్ ఆథంటికేషన్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది.