న్యూఢిల్లీ, జూలై 19: ఒక పక్క అగ్ర రాజ్యం అధ్యక్షుడు ట్రంప్ తమ దేశంలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులపై ఆంక్షలు పెడుతూ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామని నిత్యం బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో ఆ దేశంలో చదవాలంటేనే విద్యార్థుల్లో భయం పట్టుకుంది. ఇటీవలి కాలంలో ఆ దేశ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇదంతా తాత్కాలికమేనని, భారతీయ విద్యార్థులకు విదేశీ చదువుపై మోజు ఎంత మాత్రం తగ్గదని, పైగా మరో ఐదేళ్ల నాటికి ప్రస్తుతం చేస్తున్న దానికన్నా రెట్టింపు వ్యయం విదేశీ విద్యపై చేస్తారని ఒక నివేదిక వెల్లడించింది.
భారతీయ కుటుంబాలు తమ పిల్లల విదేశీ విద్య కోసం 2030 నాటికి 91 బిలియన్ డాలర్లు (రూ.7.55 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నారు. 2024లో ఈ ఖర్చు 44 బిలియన్ డాలర్లు (రూ.3.65 లక్షల కోట్లు) మాత్రమే ఉందని గ్లోబల్ పేమెంట్స్ సంస్థ వైజ్ అండ్ రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్ సంస్థ వెల్లడించింది. అంటే ఆరేండ్లలో వ్యయం రెట్టింపు కానుంది. ఆ సంస్థ శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం… 2024లో విదేశీ విద్యపై చేసిన వ్యయంలో దాదాపు నాలుగోవంతు 11 బిలియన్ డాలర్లు (రూ.94.8 వేల కోట్లు)గా ఉంది.
తాజా ఆర్బీఐ డాటా ప్రకారం సెంట్రల్ బ్యాంక్ లిబరలైజ్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ విద్య కోసం భారతీయులు విదేశాలకు పంపిన డబ్బు ఏప్రిల్‌లో 21 శాతం తగ్గి 164 మిలియన్ డాలర్ల (రూ.1,408 కోట్లు)కు చేరుకుంది. వాస్తవానికి, 2025 మొదటి నాలుగు నెలల్లో విదేశీ అధ్యయనాల కోసం ఎల్ఆర్ఎస్ కింద ఖర్చు 21 శాతం తగ్గి 874 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ పథకం కింద అధ్యయనాల కోసం విదేశాలకు పంపిన డబ్బు సంవత్సరానికి తగ్గింది. ఎల్ఆర్ఎస్ కింద భారతీయులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల (రూ.2.15 కోట్లు)ను విదేశాలకు పంపేందుకు ఆర్బీఐ అనుమతి ఇస్తుంది. అయితే ఇటీవలి కాలంలో అమెరికాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా విదేశాలకు భారతీయులు పంపే డబ్బు తగ్గుతూ వస్తున్నది. అలాగే భారతీయ విద్యార్థులకు అగ్రరాజ్యం జారీ చేసే వీసాల సంఖ్య కూడా 2024 మొదటి తొమ్మిది నెలల్లో 38 శాతం తగ్గింది. అయితే ఇదంతా తాత్కాలికమేనని భావిస్తున్నారు.
వైజ్-రెడ్‌సీర్ అంచనా ప్రకారం 2030 నాటికి విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 25 లక్షలకు చేరుతుంది. గత దశాబ్ద కాలంతో పోలిస్తే ఆకర్షణీయ ఎడ్యుకేషన్ హబ్‌లుగా పేరొందిన అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో మన విద్యార్థుల సంఖ్య 11 శాతం పెరిగింది. మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో మన వారు మూడో వంతు ఉన్నారు. ఆకర్షణీయమైన హబ్‌లతో పాటు జర్మనీ, ఐర్లాండ్, యూఏఈ, సింగపూర్లు కూడా ఇప్పుడు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. దేశమేదైనా విదేశాలకు వెళ్లేందుకు మనవారు చేసే వ్యయం మాత్రం రానున్న ఐదేండ్లలో రెట్టింపు అవుతుందని వైజ్-రెడ్‌సీర్ అంచనా వేసింది.