Indian Railways | భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయల్దేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్‌ను రైల్వేబోర్డు అప్డేట్ చేసింది.
ప్రస్తుతం రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందుగా రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆఖరి నిమిషంలో చార్ట్ ప్రిపేర్ కావడం వల్ల టికెట్ కన్ఫార్మ్ కాని ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి 10 గంటల ముందే చార్ట్ ప్రిపేర్ చేయడం వల్ల ప్రయాణికులు.. ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలవుతుందని రైల్వే శాఖ భావించింది. ఈ నేపథ్యంలోనే 10 గంటల ముందే చార్ట్ ప్రిపేర్ చేయాలని నిర్ణయించింది.
ఈ కొత్త టైమింగ్స్ ప్రకారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయల్దేరే రైళ్లకు తొలి చార్ట్‌ను ముందు రోజు రాత్రి 8 గంటలకల్లా రూపొందించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బయల్దేరే రైళ్ల తొలి చార్టును కనీసం 10 గంటల ముందు రూపొందించనున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం చార్టుల తయారీకి సత్వరమే చర్యలు తీసుకోవాలని అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖ రాసింది.