Air India crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయి గుండెలు అవిసేలా విలపిస్తున్నారు. లండన్‌లో స్థిరపడ్డ ఓ భారతీయుడు తన భార్య చివరి కోరికను తీర్చేందుకు (fulfilling wifes dying wish) స్వదేశానికి వచ్చి తిరిగిరాని లోకాలకు చేరాడు.
గుజరాత్ రాష్ట్రం అమ్రేలీ జిల్లాకు చెందిన అర్జున్‌భాయ్ మనుభాయ్ పటోలియా లండన్‌లో స్థిరపడ్డారు. తన భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలోనే అతడి భార్య భారతీబెన్ వారం రోజుల క్రితమే ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోయే ముందు తన అస్థికలను మాతృభూమిలో కలపాలని భర్తను కోరింది. ఆమె కోరిక మేరకు అర్జున్‌భాయ్ తన 4, 8 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లల్ని లండన్‌లోనే వదిలి ఇటీవలే ఇండియాకు వచ్చాడు.
వాడియాలో బంధువులతో కలిసి భార్య అస్థికలను (ashes) నర్మదా నదిలో కలిపిన అర్జున్.. లండన్‌కు తిరుగు పయనమయ్యాడు. లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. భార్య చివరి కోరిక తీర్చిన ఆనందంలో అతను ఫ్లైట్ ఎక్కాడు. అంతే నిమిషాల్లోనే ఆయన ప్రాణం గాల్లోనే కలిసిపోయింది. అతను ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కుప్పకూలిపోయింది. అతడి మృతితో ఇప్పుడు ఇద్దరు పిల్లలూ అనాథలయ్యారు.తల్లిని కోల్పోయి పుట్టెడు దుఖఃలో ఉన్న ఆ చిన్నారులు ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి, తండ్రిని కోల్పోయి అనాథలుగా మిగిలారు. మరోవైపు వారం రోజుల వ్యవధిలోనే ఇద్దర్ని కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఎయిర్ ఇండియా (Air India)కు చెందిన బోయింగ్ ఏ-171 విమానం 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో గురువారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్‌పై కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మరణించారు. ఒకే ఒక్కరు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు.
Also Read..
Ahmedabad Plane Crash | ప్రాణాలతో ఎలా బయటపడ్డానో నాకే తెలియదు.. విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు