Quit India | పెట్టుబడులు పెట్టి, కంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించాల్సిన కోటీశ్వరులైన వ్యాపారులు భారత్‌ను వీడుతున్నారు. ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను విడిచిపెట్టి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు హెన్లీ అండ్ పార్టనర్స్ రిపోర్టు-2024 పేర్కొన్నది. మిలియనీర్ల వలసలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా, యూకే వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉండగా భారత్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం.
దేశంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలుచేస్తున్న ఏకపక్ష విధానాలు, తీసుకొస్తున్న కొత్త నిబంధనల పట్ల విసుగెత్తే మిలియనీర్లు మాతృదేశాన్ని విడిచిపెట్టి బయటి దేశాలకు వలస వెళ్తున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు దేశంలో భద్రత, ఆర్థిక పరిస్థితులు, పన్ను ప్రయోజనాలు, వ్యాపారావకాశాలు, పిల్లలకు విద్యావకాశాలు, వైద్యం, జీవన ప్రమాణాలను బేరీజు వేసుకొన్న తర్వాతనే ఇండియన్ మిలియనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్తున్నట్టు హెన్లీ నివేదిక వెల్లడించింది.
-(స్పెషల్ టాస్క్ బ్యూరో), హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ)