Ind vs Pak : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) జరిగినప్పటి నుంచి భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య పెరుగుతూ వచ్చిన ఉద్రిక్తతలకు శనివారంతో తెరపడింది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ప్రకటించాయి. తాజాగా భారత సైన్యం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అధికారికంగా ప్రకటించింది.
మీడియా సమావేశంలో సీఎండీఈ (CMDE) రఘు నాయర్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని అన్నారు. శనివారం మధ్యాహ్నం పాక్ డీజీఎంవో భారత డీజీఎంవోకు ఫోన్లో కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారని, ఈ ప్రతిపాదనకు భారత్ అంగీకరించిందని తెలిపారు. కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. భారత్‌లో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు పాకిస్థాన్ అసత్య ప్రచారం చేసిందని అన్నారు. పాకిస్థాన్‌లోని మత సంస్థలపై భారత్ దాడులు చేసిందనడం అవాస్తవమని చెప్పారు.
నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం జరిగిందని ఖురేషి తెలిపారు. భారత సైన్యం సర్వసన్నద్ధతో ఉన్నదని, పాకిస్థాన్ ఆర్మీ బేస్‌లను ధ్వంసం చేసిందని చెప్పారు. పాకిస్థాన్ చెబుతున్నట్లుగా భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ.. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400ను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ అబద్ధం చెప్పిందని తెలిపారు.
పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలనే తాము ధ్వంసం చేశామని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన జేఎఫ్-17 యుద్ధ విమానం భారత్‌పై దాడి చేసిందనడం కూడా అసత్యమేనన్నారు. పాకిస్థాన్‌కు భారత్ ధీటైన జవాబిచ్చిందని చెప్పారు. ఇకపై కూడా పాక్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ధీటుగా జవాబిస్తామని తెలిపారు.