హైదరాబాద్, ఏప్రిల్ 15 ( నమస్తే తెలంగాణ ) : భారత వాతావరణ విభాగం వ్యవసాయ రంగానికి శుభవార్తనందించింది. వచ్చే వానకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని మంగళవారం వెల్లడించింది. తెలంగాణతోపాటు మరాఠ్వాడా ప్రాంతంలో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందని, తమిళనాడులోని అధిక ప్రాంతాలు, ఈశాన్య రాష్ర్టాలలో మాత్రం సాధారణంకంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం ఉండే జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో సంచిత వర్షపాతం 105 శాతం ఉండవచ్చని భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన ప్రారంభమై సెప్టెంబర్ 30న ముగుస్తాయని తెలిపారు. సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం 30 శాతం ఉన్నదని, సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం 33 శాతం ఉన్నదని, అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం 26 శాతం ఉన్నదని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు.
దేశంలో 1971-2020 మధ్యకాలంలో దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లు మాత్రమే ఉండేదని పేరొన్నారు. ఎల్‌నినో తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడితే.. వర్షాకాలంలో సాధారణం కంటే తకువ స్థాయిలో వర్షాలు పడతాయి. ఈసారి భారత్‌లో ఆ తరహా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, బీహార్‌తోపాటు ఈశాన్య రాష్ర్టాలలో ఈ వర్షాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లో సాధారణం నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎండ వేడిమి పెరిగిందని, పలు చోట్ల వడగాలులు వీస్తున్నాయని ఫలితంగా విద్యుత్తు గ్రిడ్లు ఫెయిల్ అవుతున్నాయని అన్నారు.