Yusuff Ali | ఇండియన్ బిలియనీర్ (Indian Billionaire), లులు గ్రూప్ చైర్మన్ (Lulu Group chairman) ఎంఏ యూసఫ్ అలీ (Yusuff Ali) గొప్ప మనసు చాటుకున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ మహిళకు (Kerala Woman) ఆపన్నహస్తం అందించారు. అప్పు తీర్చడమే కాకుండా.. జీవితంలో స్థిరపడేందుకు లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా అందజేశారు.
కేరళలోని నార్ద్ పరవుర్కు చెందిన సంధ్య అనే మహిళ, ఆమె భర్త ఇంటి నిర్మాణం కోసం 2019లో ఓ ప్రైవేటు సంస్థలో రూ.4 లక్షల రుణం తీసుకున్నారు. అయితే, రెండేళ్ల తర్వాత పిల్లల్ని, ఆమెను వదిలేసి భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దాంతో కుటుంబ పోషణ, పిల్లల బాధ్యతకు తోడు ఆ అప్పు భారం మొత్తం కూడా ఆమెపైనే పడింది. ఇక బతుకుదెరువు కోసం ఆమె స్థానికంగా ఉన్న దుకాణంలో పనిచేస్తూ పిల్లల్ని కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అయితే, చాలీచాలని జీతంతో సకాలంలో వాయిదా చెల్లించలేకపోయింది. దీంతో వడ్డీతో కలిపి మొత్తం అప్పు రూ.8 లక్షలకు పెరిగింది.
ఆ మొత్తం చెల్లించాలని రుణం ఇచ్చిన సంస్థ సంధ్యపై ఒత్తిడి తెచ్చింది. ఈ మేరకు నాలుగుసార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత చట్టపరమైన చర్యలకు పూనుకుంది. ఆమె పనికి వెళ్లిన సమయంలో.. సదరు సంస్థ ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంది. ఆ విషయం తెలిసిన ఆమె.. తన సామాన్లు తీసుకుంటానని ఎంత అభ్యర్థించినా వారు మాత్రం కనికరించలేదు. దీంతో పిల్లలతో పాటు ఆమె కట్టుబట్టలతో రోడ్డుపై పడింది.
ఈ విషయాన్ని పలు ప్రసార మాధ్యామాల ద్వారా తెలుసుకున్న యూసఫ్ అలీ.. తన సిబ్బందిని ఆమె వద్దకు పంపారు. ఇంటికి తీసుకున్న రుణం మొత్తం చెల్లించడమే కాకుండా, ఆమెకు అదనంగా రూ.10 లక్షలు ఆర్థిక సాయంగా అందజేశారు. ఆమెకు తన ఇంటి తాళాలను అందించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, నెటిజన్లు ప్రతి ఒక్కరూ బిలియనీర్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. కష్టకాలంలో తనను ఆదుకున్న యూసఫ్ అలీకి బాధితురాలు సంధ్య కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read..
British Influencer | కంటెంట్ పిచ్చి.. ఎత్తైన బ్రిడ్జ్ పై నుంచి జారిపడి ఇన్ఫ్లుయెన్సర్ మృతి
North Korea | దక్షిణ కొరియాను కలిపే సరిహద్దు రోడ్లను పేల్చేసిన కిమ్ సైన్యం
Pumpkin | 1,121 కేజీల భారీ కూష్మాండాన్ని పండించి.. విజేతగా నిలిచిన అమెరికా టీచర్