Indian Army | న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద అక్నూర్ సమీపంలో టెర్రరిస్ట్ లాంచ్ప్యాడ్లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఇటీవల పంజాబ్, జమ్ముకశ్మీర్‌లలో పాకిస్థాన్ వరుసగా డ్రోన్ దాడులకు తెగబడటంతో ఈ దాడులు చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ధ్రువీకరించినట్టు ఎన్డీటీవీ కథనం వెల్లడించింది. ధ్వంసం చేసిన బేస్ పాకిస్థాన్‌లోని సియాల్కోట్ జిల్లా వద్ద ఉన్నట్టు పీటీఐ కథనం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసిన వీడియో ఫుటేజీని భారత ఆర్మీ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.
మన దేశంలోని పౌరులు, భద్రతాదళాలపై ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేయడం, చొరబాట్లను ప్రారంభించడంతో గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతాలపై నిఘా ఉంచినట్టు ఆర్మీ వెల్లడించింది. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ దాడులను పెంచినట్టు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం ఉదయం 5 గంటలకు కొన్ని డ్రోన్లు అమృత్‌సర్‌లో తిరుగుతుండడంతో వాటిని కూల్చేసినట్టు ఆర్మీ స్పష్టం చేసింది.