కోల్కతా, జనవరి 26: కోల్కతాలో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో సైనిక దళానికి చెందిన రోబోటిక్ శునకాలు ‘మ్యూల్’ (మల్టీ యుటిలిటీ లెగ్గీ ఎక్విప్మెంట్) క్రమశిక్షణతో కవాతు చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాయి. ‘సంజయ్’ అని నామకరణం చేసిన ఈ రోబో శునకాలు మెట్లు, కొండలు ఎక్కడం, అడ్డంకులను దాటుకుని వెళ్లడం సహా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగలవు.
పెరీమీటర్ సెక్యూరిటీ, ఆస్తుల రక్షణ, పేలుడు పదార్థాలను గుర్తించడం, నిర్వీర్యం చేయడం, నిఘా లాంటి కార్యకలాపాలను నిర్వహించగలదని సైన్యం వెల్లడించింది. మైనస్ 40 నుంచి 55 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలుండే అత్యంత ప్రతికూల ప్రాంతాల్లో సైతం పని చేయగలిగే ఈ రోబో శునకాలు 15 కిలోల బరువును సైతం మోసుకెళ్లగలదని, భారత సైనిక దళానికి చెందిన వివిధ యూనిట్లలో ఇప్పటివరకు దాదాపు 100 రోబో శునకాలను మోహరించామని అధికారులు తెలిపారు.