న్యూఢిల్లీ: భారత ఆర్మీ నిఘా సామర్థ్యాలకు మరింత బూస్ట్ లభించింది. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలపాటు ఆలస్యమైనా.. ఇజ్రాయెల్‌కు చెందిన అధునాతన హెరాన్ డ్రోన్స్ ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాయి. ఈ అడ్వాన్స్డ్ హెరాన్ డ్రోన్స్‌ను లఢఖ్ సెక్టార్లో విస్తరించనున్నారు. లఢఖ్ సెక్టార్లో చైనా కదలికలపై నిఘా వేయడం కోసం ఇజ్రాయెల్ నుంచి భారత్ ఈ డ్రోన్స్‌ను దిగుమతి చేసుకుంది. అత్యవసర సేకరణ నిబంధన కింద ఇండియన్ ఆర్మీ వీటిని తెప్పించుకుంది.
ఇజ్రాయెల్ నుంచి అధునాతన హెరాన్ డ్రోన్స్ భారత్‌కు చేరుకున్నాయి. తూర్పు లఢఖ్ సెక్టార్లో నిఘా కార్యకలాపాల కోసం ఈ డ్రోన్లను తరలిస్తున్నారు అని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న హెరాన్ డ్రోన్స్ కంటే ఈ డ్రోన్స్ మరింత అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయని చెప్పారు.