Operation Sindoor | న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్నదని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆదివారం ప్రకటించింది. తమకు అప్పగించిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో జాతి ఉద్దేశాలకు అనుగుణంగా విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ‘ఆపరేషన్స్ కొనసాగుతున్నందున పూర్తి వివరాలు సరైన సమయంలో పూర్తిగా వెల్లడిస్తాం. ధ్రువీకరించని సమాచారాన్ని, వదంతులను నమ్మొద్దు’ అని తన ప్రకటనలో తెలిపింది. భారత్-పాక్ శనివారం కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
ఢిల్లీ, మే 11: డీజీఎంవో స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘిస్తే ఉపేక్షించవద్దని, కౌంటర్ ఎటాక్ చేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కమాండర్లకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంలో వారికి పూర్తి అధికారాలు ఇచ్చారు. కాల్పుల విరమణకు ఇరుపక్షాల మధ్య అవగాహన కుదిరిన తర్వాత కూడా శనివారం రాత్రి పాక్ గగనతల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో కమాండర్ స్థాయి అధికారులతో ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు. పశ్చిమ సరిహద్దులో పరిస్థితులపై సమీక్షించారు. ఈ మేరకు భారత ఆర్మీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ ఉధంపూర్ జిల్లాలోని వైమానిక స్థావరంపైకి శనివారం పాక్ ప్రయోగించిన డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసింది. అయితే ఆ డ్రోన్ శకలాలు పడి ఒకరు, సరిహద్దు వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో మరో జవాన్ మృతి చెందారు. వైమానిక స్థావరం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ భారత జవాన్‌కు శకలాలు తగలడంతో.. ఆయన తీవ్ర గాయాలతో మృతి చెందాడు. వీర మరణం పొందిన ఆ జవానును రాజస్థాన్‌కు చెందిన సురేంద్ర సింగ్ మోగాగా గుర్తించారు. ఆయన మృతికి రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ ఎక్స్‌లో సంతాపం వ్యక్తం చేశారు.
జమ్ము రీజియన్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు మృతి చెందారు. జమ్ము జిల్లాలోని ఆర్ఎస్ పుర ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద శనివారం పాకిస్థాన్ జరిపిన ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ దీపక్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్టు అధికారులు ప్రకటించారు.