వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదు అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని ఆయన గతంలోనూ పేర్కొన్న విషయం తెలిసిందే. భారత్ ఇప్పటికే వెనక్కి తగ్గిందని, రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని ఆపేసిందన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో శుక్రవారం జరిగన భేటీ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేవారు. రష్యా నుంచి భారత్ ఇంధనాన్ని కొనుగోలు చేయదని, ఆ నిర్ణయాన్ని వాళ్లు వెనక్కి తీసుకున్నారని, ఇప్పటికే రష్యా నుంచి 38 శాతం ఆయిల్‌ను భారత్ కొనుగోలు చేసిందని, ఇక భవిష్యత్తులో ఇంధన కొనుగోలు ఉండదని ట్రంప్ అన్నారు.
కొన్ని రోజుల క్రితం వైట్‌హౌజ్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లు చెప్పారు. రష్యా నుంచి భారత్ ఇంధనాన్ని కొనుగోలు చేయడం పట్ల సంతోషంగా లేనని, ఆయన హామీ ఇచ్చారని, అదో పెద్ద నిర్ణయం అని ట్రంప్ అన్నారు. ఈ అంశంలో ట్రంప్, మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు వచ్చిన వార్తలను భారత సర్కారు ఖండించింది.