India advisory : పశ్చిమాసియా (West Asia) లో ఇజ్రాయెల్, ఇరాన్ (Israel, Iran) మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. దాంతో భారత ప్రభుత్వం (Indian Govt) అప్రమత్తమైంది. ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు వెంటనే దేశం విడిచి వచ్చేయాలని భారత పౌరులను మరోసారి హెచ్చరించింది. ఈ మేరకు టెహ్రాన్ (Tehran) లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘ఇక్కడి తాజా పరిణామాల దృష్ట్యా ఇరాన్‌కు ఎలాంటి ప్రయాణాలు చేయవద్దు. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారత పౌరులు కూడా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా స్వదేశానికి వెళ్లిపోవాలి’ అని ఎంబసీ తన ప్రకటనలో స్పష్టంచేసింది.
ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగాయి. ఇరాన్‌లోని మహ్షహర్ ప్రాంతంలో ఉన్న పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపింది. ఈ దాడుల నేపథ్యంలోనే భారత్ ఈ ట్రావెల్ అడ్వైజరీని జారీచేసింది. ఇజ్రాయెల్ గనక దక్షిణ లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇజ్రాయెల్, దాని మద్దతుదారులపై వినాశకరమైన దాడులు తప్పవని ఇరాన్ కమాండర్ అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు.
అమెరికా పచ్చజెండా ఊపడంతోనే ఇజ్రాయెల్ ఫాస్పరస్ బాంబుల వంటి నిషేధిత ఆయుధాలను వాడుతూ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని అలీ అబ్దుల్లాహీ ఆరోపించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, ఇతర సైనిక ఉన్నతాధికారులు మరణించడంతో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ పలుచోట్ల డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ, ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శాంతి స్థాపన కోసం ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నట్లు కూడా నివేదికలు వస్తున్నాయి.