న్యూఢిల్లీ : భారతీయ వస్తువులపై భారీగా టారిఫ్‌లను పెంచుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై భారత్ బదులిచ్చింది. భారత్‌ను టార్గెట్ చేయడం అసమంజసం, సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ సోమవారం స్పందిస్తూ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడం భారత్‌కు తప్పనిసరి అవసరమని తెలిపింది.
అది రష్యాను రాజకీయంగా సమర్థించడం కాదని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడం కోసం అవసరమైన అన్ని చర్యలను భారత దేశం అమలు చేస్తుందని వివరించింది. మరోవైపు, అమెరికా, యూరోపియన్ యూనియన్ బహిరంగంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని దుయ్యబట్టింది.