న్యూఢిల్లీ, నవంబర్ 27: అమెరికా నుంచి అధిక ధరకు ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుపై తీవ్ర విమర్శలు వస్తున్నా కేంద్రంలోని మోదీ సర్కారు వెనక్కు తగ్గడం లేదు. అమెరికా రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ జనరల్ అటామిక్స్ (జీఏ) నుంచి ఎంక్యూ-9బీ రకానికి చెందిన 31 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది మార్చిలోగా ఒప్పందాన్ని ఖరారు చేసుకొనే యోచనలో భారత్, అమెరికాలు ఉన్నట్టు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. డ్రోన్ల సరఫరాకు కొద్ది వారాల్లో యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలుపుతుందని, తర్వాత మార్చి నాటికి రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం ఖరారు అవుతుందని తెలిపాయి.
డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి భారత ప్రభుత్వ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్(ఎల్‌వోఆర్)పై అమెరికా స్పందించిన తర్వాత భారత్, అమెరికా ప్రభుత్వాలు తుది దశ చర్చలు జరుపుతాయని పేర్కొన్నాయి. ఈ చర్చల్లో కొనుగోలు ధరను ఖరారు చేస్తారని చెబుతున్నప్పటికీ, ఈ డ్రోన్ల డీల్ దాదాపు రూ.25 వేల కోట్లు( 3 బిలియన్ డాలర్లు) ఉండే అవకాశం ఉన్నది. ఈ నెల మొదట్లో ఢిల్లీలో జరిగిన భారత, అమెరికా రక్షణ శాఖ మంత్రులు రాజ్‌నాథ్, లాయిడ్ ఆస్టిన్‌ల సమావేశంలో ప్రతిపాదిత ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుపై చర్చ జరిగినట్టు సమాచారం.
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వయంగా గత జూన్‌లో డ్రోన్ల కొనుగోలు ఒప్పంద చర్చల్లో భాగమయ్యారు. దాదాపు 3 బిలియన్ డాలర్లు(రూ.25 వేల కోట్లు) జీఏకు భారత్ చెల్లించనున్నట్టు ప్రాథమిక ఎంవోయూలో ఇరువర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ విపణిలో ఇదే మాడల్ ప్రిడేటర్ ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.150 కోట్లు మాత్రమే. అయితే ఒక్కో డ్రోన్‌కు రూ.813 కోట్లు చెల్లించేందుకు భారత్ సిద్ధమవ్వడంపై ప్రతిపక్షాలు, ఇతర వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇంకా డీల్ ఫైనల్ కాలేదని కేంద్రం చెప్పుకొచ్చింది. జీ20 సమావేశాల కోసం భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ జరిపిన సమావేశంలోనూ ఈ డీల్‌పై చర్చ జరిగిందని, రూ.25 వేల కోట్ల మేరకే ప్రిడేటర్ డ్రోన్ డీల్‌ను ఖరారు చేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో డ్రోన్ల కొనుగోలులో గోల్మాల్ జరుగుతున్నదన్న ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుపై ఆర్మీ విభాగం అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తున్నది. 31 డ్రోన్లు ప్రస్తుతం తమకు అవసరం లేదని, 18 డ్రోన్లను కొనుగోలు చేయాలని గత ఏప్రిల్‌లో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. డ్రోన్ల కొనుగోలుపై పునరాలోచించాలని కూడా ఓసారి సూచించింది. అయినప్పటికీ, ఇవన్నీ పట్టించుకోని కేంద్రం.. డీల్‌పై ఏకపక్షంగానే ముందుకు వెళ్తున్నది. 31 డ్రోన్ల సరఫరా, మరమ్మతులు, ఇతరత్రా సహాయక చర్యలను నిర్ణీత వ్యవధి వరకు అందిస్తామని జీఏ ఎంవోయూలో పేర్కొన్నది. అయితే, డ్రోన్లకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. ఇది భారత భద్రతకు ముప్పేనని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.
కాగా, ఒక్కో దేశానికి ఒక్కో రేటుకు డ్రోన్లను సరఫరా చేసే ట్రాక్ రికార్డు జీఏకు ఉన్నట్టు తెలుస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ తరహా డ్రోన్లను మార్కెట్ రేటుకే తయారుచేసే సామర్థ్యం హాల్, డీఆర్డీవో వంటి స్వదేశీ రక్షణ సంస్థలకు కూడా ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. అయితే, దేశీయ సంస్థలను ప్రోత్సహించకుండా కేంద్రం ఆయా కాంట్రాక్ట్‌లను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు.