India : ఒమన్ తీరం (Oman Coast) లో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి జరిగిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ (Foreign Ministry) స్పందించింది. మరో నౌకపై దాడి జరిగిందన్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నది. భారత సిబ్బందితో ఉన్న లియాకీ ఫ్రీడమ్ (Liaki Freedom) అనే నౌక ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తుండగా.. దాని నుంచి ఒక్కసారిగా స్పందన ఆగిపోయింది. దాంతో అమెరికా (USA) దాడి చేసిందంటూ పలు వార్తా పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఈ ఘటనలో నలుగురు భారతీయ నావికులు మరణించారంటూ ప్రచారం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్దఎత్తున పోస్టులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే విదేశాంగశాఖ స్పందించింది. ఆ నౌకలోని మాస్టర్‌తో మాట్లాడినట్లు పేర్కొన్నది. నౌకపై ఎలాంటి దాడి జరగలేదని ధ్రువీకరించింది. సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టంచేసింది. ఇలాంటి తప్పుడు వార్తల ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. కాగా ఇటీవల ఒమన్ తీరం సమీపంలో భారతీయులు ఉన్న నౌకలపై వరుసగా దాడులు జరిగాయి.
వారం వ్యవధిలో మూడు నౌకలను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. భారత్ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఈ చర్యలను ఆపేయాలంటూ అమెరికాపై నిరసన వ్యక్తం చేసింది. కాగా హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు ప్రయోగించిందని అమెరికా దళాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.