న్యూఢిల్లీ: జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) అన్నారు. భారతీయ ఉత్పత్తులపై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలో.. ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ఆ అంశంపై మాట్లాడారు. సుమోటో స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ల వల్ల కలిగే పరిణామాలను స్టడీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కొత్త పన్ను విధానం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్‌ది డెడ్ ఎకానమీ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు ఆయన చెప్పారు.