UNSC : కాల్పులు విరమణకు శనివారం రెండు దేశాలు అంగీకరించినా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంగీకారం కుదిరిన మూడు గంటలల్లో పాకిస్థాన్ మాట తప్పి, బరితెగించి ఆర్ఎస్ పుర సెక్టార్ (RS pura sector) లో భారత సైన్యం (Indian military) పై దాడి చేయడం తాజా ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ క్రమంలో రెండు దేశాల డీజీఎంవోలు (DGMOs) సోమవారం మధ్యాహ్నం హాట్లైన్లో చర్చలు జరుపబోతున్నారు. ఆ చర్చలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
ఇదిలావుంటే పహల్గాంలో నరమేథానికి పాల్పడిన టెర్రరిస్టులు పాకిస్థాన్‌లోనే శిక్షణ పొందారని భారత్‌కు ఆధారాలు లభించాయి. ఉగ్రవాదంలో పాకిస్థాన్‌కు భాగస్వామ్యం ఉందని నిర్ధారించే ఈ తాజా ఆధారాలను ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి అందజేయాలని భారత్ భావిస్తోంది. వచ్చే వారం జరుగనున్న ‘యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిసొల్యూషన్ 1267 (UNSCR 1267)’ సాంక్షన్స్ కమిటీ సమావేశంలో తాజా సాక్ష్యాధారాలను అందజేయనుంది. అందుకోసం భారత్ ఒక బృందాన్ని భద్రతామండలికి పంపుతోంది. ఈ విసయాన్ని ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.