Balochistan : బలూచిస్తాన్లో బీఎల్ఏ (బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ) తిరుగుబాటుదారులు, పాకిస్తాన్ ఆర్మీకి మధ్య శనివారం కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 92 మంది ఉద్యమకారులు, 15 మంది పాక్ పౌరులు మరణించినట్లు పాక్ అధికారులు వెల్లడించారు. అయితే, బీఎల్ఏ కాల్పుల వెనుక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. పాక్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఈ ఆరోపణలు చేశాడు.
కానీ, ఈ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల విషయంలో ఇండియాపై పాక్ చేసిన ఆరోపణలను ఖండించింది. ‘‘ఇండియా విషయంలో ఆధారాలు లేకుండా పాక్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. తమ సొంత తప్పిదాల్ని కప్పి పుచ్చుకోవడానికి, ఎప్పట్లాగే పాక్.. ఇండియాపై విమర్శల వ్యూహాన్ని అమలు చేసింది. తమ దేశంలో హింసాత్మక ఘటన జరిగిన ప్రతిసారి ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేసే బదులు.. ఆ ప్రాంతంలోని తమ ప్రజలు అడుగుతున్న డిమాండ్లపై దృష్టిపెట్టాలి. ఆ ప్రాంతంలో అణచివేత, హింస, క్రూరత్వం, మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయనే సంగతి తెలిసిందే’’ అని భారత్ బదులిచ్చింది. బీఎల్ఏ శనివారం బలూచిస్తాన్ ప్రాంతంలోని 14 పట్టణాల్లో ఏకకాలంలో దాడి చేసింది. ఆపరేషన్ హెరాఫ్ 2.0 పేరుతో ఈ దాడికి పాల్పడింది.
పాకిస్తాన్ భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఆత్మాహుతి దాడులతోపాటు ఆయుధాలతో కూడా దాడి చేసింది. ఈ ఘటనలో తాము 84 మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బందిని హతమార్చామని, 18 మందిని బందీలుగా తీసుకున్నామని బీఎల్ఏ వెల్లడించింది. సెంట్రల్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ సహా పలు ప్రభుత్వ స్థావరాల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. పాక్ ఆర్మీ, బీఎల్ఏ మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.