న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్ (Mpox) తొలి కేసు దేశంలో నమోదైనట్లు తెలుస్తున్నది. ఈ వైరస్ లక్షణాలున్న వ్యక్తికి ఎంపాక్స్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ప్రత్యేక ఆసుపత్రిలోని ఐసొలేషన్‌లో అతడ్ని ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షకు పంపినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని పేర్కొంది. ఎంపాక్స్ వైరస్‌తో పోరాడుతున్న దేశం నుంచి ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చిన యువకుడ్ని అనుమానిత కేసుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఆ రోగిని ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పింది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. ఆ వ్యక్తికి ఎంపాక్స్ సోకిందా లేదా అన్నది నిర్ధారించేందుకు అతడి నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు వెల్లడించింది.
కాగా, ఎంపాక్స్‌కు సంబంధించిన ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఈ కేసును డీల్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ వ్యక్తిని కలిసిన వారిని గుర్తించేందుకు, అతడి నుంచి వైరస్ వ్యాప్తిని నిర్ధారించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) జారీ చేసిన ప్రమాద అంచనాలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు వివరించింది.
మరోవైపు తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఎంపాక్స్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా గత నెలలో ప్రకటించింది. 2022 జనవరి నుంచి 2024 ఆగస్ట్ వరకు 120కుపైగా దేశాల్లో ఎంపాక్స్ వ్యాప్తి చెందినట్లు తెలిపింది. లక్షకుపైగా కేసులు నిర్ధారణ కాగా, 220కుపైగా మరణాలు నమోదైనట్లు పేర్కొంది.