న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ రెండు లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. గురువారం 2.8 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు 2.51 లక్షలకు తగ్గాయి. దీంతో పాజిటివిటీ రేటు కూడా తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కొత్తగా 2,51,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,06,22,709కి చేరాయి. ఇందులో 3,80,24,771 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,92,327 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 21,05,611 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
గత 24 గంటల్లో కొత్తగా 627 మంది మరణించగా, 3,47,443 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసులు తక్కువవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 15.28 శాతానికి తగ్గిందని పేర్కొన్నది. ఇక ఇప్పటివరకు 1,64,44,73,216 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.