న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ద్వీపశ్రేణికి రాజధానిగా ఉన్న పోర్ట్బ్లెయిర్ నగరం పేరును శ్రీవిజయపురంగా మార్చినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించారు. దేశంలో ఇప్పటికే ఎన్నో నగరాలు, పట్టణాల పేర్లు మార్చిన కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం.. వలసపాలకుల ముద్రలు చెరిపేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
దేశ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులకు అసమాన స్థానం ఉన్నదని అమిత్షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నౌకా స్థావరంగా ఉన్న అండమాన్ దీవులు ఇప్పుడు భారత అభివృద్ధి, వ్యూహాత్మక ఆకాంక్షలకు కీలకమైన ప్రాంతమని తెలిపారు. అండమాన్ ద్వీప సముదాయంలో 836 దీవులు ఉన్నాయి.