న్యూఢిల్లీ: దేశంలో కరోనా మూడో వేవ్ ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నది. దీంతో మహమ్మారి బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది. ఈ క్రమంలో దేశంలో రోజువారీ కేసుల రెండు లక్షలకు చేరువయ్యాయి. మంగళవారం నాటి కేసుల కంటే ఇవి 15.8 శాతం అధికమని అధికారులు తెలిపారు. అదేవిధంగా యాక్టివ్ కేసులు కూడా 9 లక్షలు దాటడంతో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.
దేశవ్యాప్తంగా కొత్తగా 1,94,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,60,70,510కి చేరాయి. ఇందులో 3,46,30,536 మంది కోలుకున్నారు. మరో 9,55,319 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,84,655 మంది బాధితులు మరణించారు. కాగా, మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 442 మంది మృతిచెందగా, 60,405 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05కు చేరిందని తెలిపింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో నానాటికి పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4868 కేసులు నమోదయ్యాయి. 1805 మంది డిశ్చార్జీ అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1247 కేసులు ఉండగా, రాజస్థాన్లో 645, ఢిల్లీ 545, కర్ణాటక 479, కేరళ 350, ఉత్తరప్రదేశ్ 275 చొప్పున ఒమిక్రాన్ బాధితులు ఉన్నారు.