న్యూఢిల్లీ: ప్రధాని మోదీ భారత్‌ను ప్రపంచానికే విశ్వగురు చేశారని, మన దేశం సూపర్ పవర్‌గా మారుతున్నదని బీజేపీ నేతలు పదేపదే గప్పాలు కొడుతుంటారు. వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన లోవి ఇన్స్టిట్యూట్ సంస్థ.. ఆసియా ఖండంలో వివిధ దేశాల ప్రభావం ఆధారంగా రూపొందించిన ఆసియా పవర్ ఇండెక్స్-2023లో భారత్ 36.3 స్కోర్‌తో నాలుగో స్థానంలో ఉన్నది. ఈ స్కోర్ కూడా తగ్గుముఖం పడుతున్నదని ఈ నివేదిక పేర్కొన్నది.
భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జపాన్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఏదైనా దేశం 100లో 70 స్కోర్ సాధిస్తే సూపర్ పవర్‌గా గుర్తించవచ్చని ఈ సంస్థ చెప్తున్నది. దీని ప్రకారం భారత్ సమీప భవిష్యత్తులో సూపర్ పవర్ కావడం కష్టమేనని సంస్థ సౌత్ఈస్ట్ ఆసియా ప్రోగ్రాం డైరెక్టర్ సుసన్న పట్టోన్ పేర్కొన్నారు. ఆసియాలోనూ భారత్ ఇప్పట్లో సూపర్ పవర్ కాలేదని, ఎప్పుడు అవుతుందనేది ఊహించడం కూడా కష్టమేనని అంచనా వేశారు.
ఎనిమిది పారామీటర్లు, 133 ఇండికేటర్ల ఆధారంగా నివేదికను తయారు చేశారు. ఇందులో ఆసియాలో దౌత్య ప్రభావంలో భారత్ మెరుగ్గా ఉన్నది. ఇందులో 100కు 65.8 స్కోర్ సాధించింది. కానీ, వివిధ దేశాలతో ఆర్థిక సంబంధాల విషయంలో మాత్రం 100కు 15.4 స్కోర్ మాత్రమే సాధించింది. భారత్ ఎగుమతుల కంటే అంతర్గత డిమాండ్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నదని, ఎక్కువగా విదేశీ వాణిజ్య ఒప్పందాల్లోనూ భారత్ భాగం కాలేదని తెలిపారు. అందుకే, ఈ పారామీటర్‌లో భారత్ వెనుకబడుతున్నదని చెప్పారు.