న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ దేశాలు అణుశక్తి కేంద్రాల(Nuclear Installations) సమాచారాన్ని పంచుకున్నాయి. అణు కేంద్రాల జాబితాను రెండు దేశాలు ఇవాళ ఇచ్చి పుచ్చుకున్నాయి. అటామిక్ కేంద్రాలపై దాడి చేయరాదు అన్న ఉద్దేశంతో ఆ స్థావరాల వివరాలను రెండు దేశాలు పరస్పరం పంచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. పెహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య సరైన సంబంధాలు లేవు. అయినా కానీ రెండు దేశాలు పూర్తి స్థాయిలో అణు కేంద్రాల సమాచారాన్ని అందజేసుకున్నాయి.
న్యూక్లియర్ కేంద్రాలపై దాడిని నిలువరించే క్రమంలో సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లు విదేశాంగ శాఖ కార్యాలయం పేర్కొన్నది. దౌత్యపరమైన రీతిలోనే ఈ జాబితా మార్పిడి జరిగినట్లు తెలిసింది. అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని పంచుకునేందుకు 1988 డిసెంబర్ 31వ తేదీన ఒప్పందం కుదిరింది. అయితే 1991 జనవరిలో ఆ ఒప్పందం అమలు జరిగింది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన ఆ సమాచారాన్ని పంచుకుంటారు. అణు కేంద్రాల జాబితాను పంచుకోవడం ఇది 35వసారి అవుతుంది. 1992 జనవరి ఒకటో తేదీన తొలిసారి సమాచారాన్ని షేర్ చేసుకున్నారు.