న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. 1,643 కిలోమీటర్ల మేర విస్తరించిన భారత్- మయన్మార్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకు కంచె వేయనున్నది. (India-Myanmar Border) దీని కోసం రూ.31,000 కోట్లు ఖర్చు చేయనున్నది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతోపాటు చొరబాట్లకు ఈ సరిహద్దు పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు 1,643 కిలోమీటర్ల భారత్- మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్, రోడ్ల నిర్మాణానికి క్యాబినెట్ భద్రతా కమిటీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నారని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి.
కాగా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల బోర్డర్లో భారత్-మయన్మార్ సరిహద్దు ఉంది. 2018లో అమలు చేసిన భారత్ ఈస్ట్ పాలసీలో భాగంగా సరిహద్దుకు సమీపంలో నివసించే ప్రజలు ఎలాంటి పత్రాలు లేకుండా ఒకరి భూభాగంలోకి మరొకరు 16 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లవచ్చు. అయితే మయన్మార్‌లో ఆర్మీ పాలన, సంఘర్షణల వల్ల ఆ దేశ ప్రజలు, గత ప్రభుత్వ అనుకూల సైనికులు, అధికారులు భారత్‌లోకి చొరబడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్-మయన్మార్ ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ (ఎఫ్ఎంఆర్)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
మరోవైపు మణిపూర్‌లో జాతి హింసకు ఈ చొరబాట్లు మూల కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని సరిహద్దులో 30 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తి చేసినట్లు మంగళవారం చెప్పారు. మోరే సమీపంలో ఇప్పటికే దాదాపు 10 కిలోమీటర్ల ఫెన్సింగ్ పూర్తైందని అన్నారు. మణిపూర్‌లోని ఇతర ప్రాంతాల సరిహద్దులో మరో 21 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణ పనులు జరుగుతున్నాయని భద్రతా సమీక్ష అనంతరం వివరించారు.